భారత్ స్టాక్ మార్కెట్ల పై కోరోనా ప్రభావం


కోవిడ్-19 మహమ్మారి వల్ల  ప్రపంచం మునుపెన్నడూ  లేనంత సంక్షోభం ముంగిట వుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు  తీవ్ర ఒడుదిడుకులను ఎదుర్కొంటూ ఆర్థిక వేత్తలకు, ప్రభుత్వాలకు సరికొత్త సవాళ్లు విసురుతోంది. చైనాలో కరోనా వైరస్ డిసెంబర్ 2019 లోనే  బయటపడ్డా, 2020 జనవరి నెలాఖరు వరకు దాని తీవ్రతను ఆ దేశం గుర్తించలేదు. ఆ తరువాత గుర్తించి చర్యలు చేపట్టినా  అప్పటికే మిగతా దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా విస్తరించి మన నాగరిక సామాజానికి , ఆర్ధిక పునాదులకు సవాలు విసురుతోంది.

గత మూడేళ్ళుగా మన దేశ ఆర్ధిక పరిస్థితి అంత బాగా లేకపోవడం ఒక ఎత్తయితే, కరోనా వైరస్ వ్యాప్తి, తదనంతర లాక్ డౌన్ మన స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి, మన ఆర్ధిక సుస్థిరతకు పెను ముప్పు తీసుకువచ్చింది.

బి.ఎస్.ఈ సెన్సెక్స్ అత్యంత తీవ్రమయిన త్రైమాసిక నష్టం ఎదుర్కుంటోంది. జనవరి-మర్చి 2020 మధ్య 28 శాతం క్షీణత నమోదయ్యింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచి 29.3 శాతం క్షీణించింది. జూన్ 1992 లో నమోదయిన 32.2 శాతం నష్టం తరువాత ఇదే అతి పెద్ద క్షీణత.

భారత ఈక్విటీ మార్కెట్ నుండి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు కేవలం ఒక్క మార్చి నెలలోనే  58,348 కోట్లు (7.9 బిలియన్ డాలర్లు) వెనక్కుతీసుకున్నారు. ఒక్క నెలలో ఇంత సంపద వెనక్కు మళ్లడం ఒక సరికొత్త రికార్డు అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇతర స్టాక్ మార్కెట్ల నష్టాల ప్రభావం, డిమాండు  తగ్గిపోవడం, చమురు ధరల రికార్డు పతనం, అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక మందగమనం, ఇలా ఎన్నో కారణాలు మన దేశ స్టాక్ మార్కెట్ల పై తమ ప్రభావం చూపుతున్నాయి.

భారీగా క్షీణించిన రంగాలు

బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ మరియు భీమా సంస్థలు. వాహన రంగం, లోహాలు మరియు రియల్ ఎస్టేట్.  ఈ రంగాలు 40 నుండి 43 శాతం వరకు నష్టాలు నమోదు చేసాయి.


తక్కువ ప్రభావం చూపిన రంగాలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 18 శాతం
ఫార్మా - 11 శాతం
త్వరగా తరలించే వినియోగ వస్తువులు - 9 శాతం


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వినియోగ వస్తువులు, ఫార్మా మరియు రసాయనాల రంగాల షేర్లు కాస్త తట్టుకుని నిలబడుతున్నా ఐరోపా మరియు ఉత్తర అమెరికా ఖండాలలో విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని మరియు అవుట్ సోర్సింగ్ రంగాన్ని బలంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా డిమాండు పడిపోవడం వల్ల చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి, దీంతో చమురు కంపెనీల షేర్లు కూడా నష్టం చూస్తున్నాయి. మన దేశంలో లాక్ డౌన్ మొదలు కాకముందే గత రెండు నెలలుగా అంతర్జాతీయ పరిణామాలతో భారత్ లో షేర్ మదుపదార్లు కొన్ని లక్షల కోట్ల సంపద కోల్పోయారు. ఇప్పుడు మన వద్దే ఈ పరిస్థితి ఉండడంతో దేశవాళీ షేర్ మార్కెట్లు మరిన్ని ఆటుపోట్లు ఎదుర్కోక తప్పదు.

గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా జరుగుతున్న నష్టం అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. మన దేశం కూడా ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చన్న ఊహాగానాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.  మన దేశంలో లాక్ డౌన్ ఎత్తేసినా ఈ సంక్షోభం నుండి ఇప్పట్లో బయటపడటం దాదాపు అసాధ్యం. ఇలాంటి సమయంలో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు మన షేర్ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి రానున్న కొన్ని నెలలు ఒక విధంగా గడ్డుకాలమే.

అదే సమయంలో ఔషధ ( ఫార్మా ) మరియు ఆరోగ్య రంగాలకు సంభందించిన కంపెనీలలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణుల సలహా. అమెరికా, చైనా  మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం మరియు కోవిడ్ -19 పరిణామాలు చైనాలోనే అన్ని కేంద్రీకృతం అవ్వడం పై ప్రపంచ దేశాలలో పునరాలోచన జరుగుతోంది. దీన్ని మన దేశం, మన కంపెనీలు అందిపుచ్చుకోవాలి.

సమీప భవిష్యత్తులో రసాయన (Pharma & Chemical), ఆగ్రో కెమికల్స్ (Agro Chemical & Pharma), స్పెషలిటీ కెమికల్స్, ఆరోగ్య రక్షణ (Health Care) వంటి రంగాల్లో పేరొందిన భారత కంపెనీలు మరింతగా విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్ ప్రభుత్వం వీటి ఎగుమతులకు మంచి ప్రోత్సాహం ఇస్తే వీటిలో పెట్టుబడులు వల్ల షేర్ల  ముదుపదార్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.